సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు: పరిణీతి చోప్రా

బాలీవుడ్ హీరోయిన్‌ పరిణీతి చోప్రా బ్యాడ్మింటన్‌ చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు. క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌కు అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్‌ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో సైనా పాత్రకు శ్రద్ధా కపూర్‌ సంతకం చేశారు. ఆమె చాలా రోజులు పాత్ర కోసం కష్టపడ్డారు. సైనా దగ్గర బ్యాడ్మింటన్‌ నేర్చుకున్నారు. సినిమాలో ఆమె ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ఆమె పాత్రను పరిణీతి పోషించబోతున్నారు.

ఈ మేరకు పరిణీతి బ్యాడ్మింటన్‌ నేర్చుకుంటున్నారు. అక్టోబరులో షూటింగ్‌ ప్రారంభం కానుండగా ఇప్పటి నుంచే సాధన మొదలు పెట్టారు. ఈ సంద్భంగా ఇండోర్‌లో బ్యాడ్మింటన్‌ ఆడుతున్న ఫొటోను, అలసిపోయి అక్కడే పడుకుని ఉన్న ఫొటోను పరిణీతి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘సాధనకు ముందు, తర్వాత.. సైనా నువ్వు ఈ ఆట ఎలా ఆడుతున్నావు’ అంటూ ఆశ్చర్యపోతున్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు. మరి ఈ పోస్ట్‌కు సైనా ఎలా స్పందిస్తారో చూడాలి.