వంశీకృష్ణతో సందీప్ కిషన్!

‘బ్ర‌హ్మ లోకం టు య‌మ‌లోకం వ‌యా భూలోకం’, ‘సినిమా చూపిస్త మావ‌’, ‘ఉహేలి'(బెంగాలి) చిత్రాల నిర్మాత‌ల్లో ఒక‌రైన రూపేష్. డి.గోహిల్ తాజాగా సోలో నిర్మాత‌గా సినిమాను రూపొందించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవ‌ల ‘కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌’ చిత్రంతో విజ‌యాన్ని చవిచూసిన వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ తాజా సినిమా రూపొంద‌నుంది.
నిర్మాత రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ.. ”ఇంత‌కు మునుపు పార్ట్ న‌ర్ షిప్‌తో ‘బ్ర‌హ్మ‌లోకం టు య‌మ‌లోకం వ‌యా భూలోకం’, ‘సినిమా చూపిస్త మావ‌’, ‘ఉహేలి'(బెంగాలి) అనే సినిమాల‌ను రూపొందించాం. తాజాగా సోలో నిర్మాత‌గా సందీప్ కిష‌న్ హీరోగా సినిమాను రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ చెప్పిన క‌థ న‌చ్చింది. స‌కుటుంబంగా కూర్చుని చూసే సినిమా అవుతుంది. కుటుంబ విలువ‌లున్న వినోదాత్మ‌క చిత్ర‌మవుతుంది. జులై 20 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం. అగ్ర‌భాగాన్ని హైద‌రాబాద్‌లోనే తెర‌కెక్కిస్తాం. ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం” అని అన్నారు.