‘సూపర్‌ 30’ ట్రైలర్‌

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘సూపర్‌ 30’. బిహార్‌కు చెందిన గణితవేత్త ఆనంద్‌ కుమార్‌ స్థాపించిన ‘సూపర్‌30’ అనే ఐఐటీ శిక్షణ సంస్థ నేపథ్యంలో ఈ సినిమాను వికాస్‌ బెహెల్‌ తెరకెక్కించారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.

‘భారత్‌.. ఓ చీప్‌ లేబర్ దేశం అంటుంటారు.మరి పెప్సికో సంస్థకు అధినేతగా వ్యవహరించింది ఎవరు? యూనిలివర్‌ సంస్థను ఎవరు నడిపిస్తున్నారు? ఈ విషయాలు ఎవ్వరికీ తెలీకపోతే గూగుల్‌లో వెతకండి. అంతేకాదు గూగుల్‌ను శాసిస్తోంది ఎవరో కూడా అందులోనే తెలుసుకోండి. వీరందరూ మన భారతీయులే కదా’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఇందులో ఆనంద్‌కుమార్‌ పాత్రలో హృతిక్‌ రోషన్‌ ఒదిగిపోయారు. ఆయన్ను ఓ విద్యా సంస్థ ఐఐటీ ప్రొఫెసర్‌గా నియమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన విద్యా సంస్థలో ఉద్యోగం మానేసి సొంతంగా కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఏటా 30 మంది ఉత్తమ విద్యార్థులకు ఉచితంగా ఐఐటీలో కోచింగ్‌ ఇస్తుంటారు. ఈ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి?అన్నదే ఈ సినిమా కథ. జులై 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.