నాపేరు నంద గోపాల కుమారన్ అంటున్న సూర్య.. ‘ఎన్‌జీకే’ ట్రైలర్‌

ప్రముఖ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఎన్‌జీకే’. సెల్వ రాఘవన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయి పల్లవి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ‘నాపేరు ఎన్‌జీకే. నంద గోపాల కుమారన్. అందరూ ఎన్‌జీకే అని పిలుస్తారు’ అంటూ సూర్య చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇందులో సూర్య చెవిటివాడి పాత్రలో నటిస్తున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. అలాంటిది అతను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటాడు. ఈ విషయం తెలిసి అందరూ షాకవుతారు. కానీ కుమారన్‌ భార్య (సాయి పల్లవి) మాత్రం అతనికే మద్దతు తెలుపుతుంది. ‘నీలాంటి వాడు రాజకీయాల్లోకి వస్తే దేశం ఎంత బాగుపడుతుందో ఆలోచించి చూశాను.. ‘ అంటూ ఎగతాళి చేసినవారే మళ్లీ కుమారన్‌కు మద్దతు తెలుపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే కథ. యువన్‌ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.