రివ్యూ: బాహుబలి ది కంక్లూజన్

నటీనటులు: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు 
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్ 
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు 
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని 
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి 
 
రెండేళ్లుగా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరిలో మెదులుతోన్న పశ్న ఒక్కటే ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’. ఆ ప్రశ్నకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది. బాహుబలి1 తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి బాహుబలి2 తో ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేశాడో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
 
కథ: 
కాలకేయుడు దాడి నుండి మహిష్మతి సామ్రాజ్యాన్ని కాపాడిన తరువాత అమరేంద్ర బాహుబలి(ప్రభాస్)ని రాజుగా ప్రకటిస్తుంది అతడి పెంపుడు తల్లి శివగామి(రమ్యకృష్ణ). మరో కొన్ని రోజుల్లో రాజుగా సర్వాధికారాలు చేపట్టనున్న బాహుబలిని దేశాటనకు పంపిస్తుంది శివగామి. బాహుబలితో పాటు కట్టప్ప(సత్యరాజ్) కూడా తోడుగా వెళ్తాడు. ఆ క్రమంలో బాహుబలి కుంతలదేశపు యువరాణి దేవసేన(అనుష్క)ను చూసి ఇష్టపడతారు. అయితే మహిష్మతి రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకోవాలని చూస్తోన్న భళ్ళాలదేవుడు(రానా), బాహుబలి.. దేవసేనను ఇష్టపడుతున్నాడని తెలిసి దేవసేనను కూడా తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. తన తల్లి శివగామి, దేవసేనను ఇచ్చి వివాహం చేస్తాననే విధంగా మాటను పొందుతాడు భళ్ళాలదేవుడు. అయితే దేవసేన.. బాహుబలిని ప్రేమిస్తుందని తెలుసుకున్న శివగామి.. రాజ్యాధికారం కావాలో..? లేక దేవసేన కావాలో నిర్ణయించుకోమని చెబుతుంది. దేవసేనకు ఇచ్చిన మాట కారణంగా రాజాధికారాన్ని వదులుకుంటాడు బాహుబలి. దీంతో రాజుగా భళ్లాలదేవుడుని ప్రకటిస్తుంది శివగామి. అయినా.. ప్రజల్లో బాహుబలికి ఉన్న పేరు, మర్యాదలు భళ్ళాలకు నిద్రలేకుండా చేస్తాయి. దీంతో తమ్ముడని కూడా చూడకుండా బహుబలిని చంపడానికి నిర్ణయించుకుంటాడు. మరి దానికి భళ్ళాల పన్నిన పన్నాగం ఏంటి..? ఇదంతా శివగామి ఆజ్ఞతోనే జరిగిందా..? చివరకు భళ్లాలదేవుడి అంతం ఎవరి చేతిలో..? వంటి పలు ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం. 
 
విశ్లేషణ: 
కట్టప్ప.. బాహుబలిని నేనే చంపానని శివుడు(బాహుబలి కుమారుడు)తో చెప్పడంతో బాహుబలి మొదటి భాగం ముగుస్తుంది. రెండో భాగం బాహుబలి ప్రేమ కథ, రాజ్యంపై అతడికున్న మమకారం, ప్రజల పట్ల అతడికున్న ప్రేమ అనే విషయాలతో నడుస్తుంది. సినిమా మొదలైన చాలాసేపటి వరకు రొటీన్ గా అనిపిస్తుంది. బాహుబలి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు కూడా కాస్త అతిగా అనిపిస్తాయి. అయితే ప్రభాస్, అనుష్కల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అనుష్క ఇంట్రడక్షన్ సీన్ పవర్ ఫుల్ గా ఉంటుంది. కుంతలదేశంపై హఠాత్తుగా శత్రువులు దాడి చేస్తే వారి నుండి బాహుబలి రాజ్యాన్ని కాపాడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ యుద్ధంలో  బాహుబలి, దేవసేనలు కలిసి బాణాలతో శత్రువులపై పోరాడే సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సుబ్బరాజ్ తో చేయించిన కామెడీ పెద్దగా పండలేదు. అసలు ఇలాంటి కథలకు కామెడీ అవసరం కూడా లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కామెడీను పెట్టడం మైనస్ అయింది.
 
ఇక ఇంటర్వల్ కు ముందు దేవసేన, శివగామిల మధ్య వచ్చే ఎపిసోడ్స్ సినిమాకు కీలకంగా మారాయి. దేవసేన పాత్రలో శివగామిని ఎదిరిస్తూ అనుష్క చెప్పే ప్రతి డైలాగ్ హైలైట్ అయింది. సినిమాలో ఇంటర్వల్ సీన్ ఆశించిన స్థాయిలో అయితే లేదు. ఇక సెకండ్ హాఫ్ ఎక్కువ శాతం యుద్ధాలతోనే నడిచింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం సినిమా చూసే ఆడియన్స్ కు ముందే అర్ధం అయిపోతుంది. సినిమాలో ఆ ఎలిమెంట్ కంటే కూడా విజువల్ గా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు రాజమౌళి. 
 
యుద్ధ సన్నివేశాలను అధ్బుతంగా చిత్రీకరించినప్పటికీ వాటిలో కొన్ని సీక్వెన్స్ లు ఓవర్ గా అనిపించడం ఖాయం. సినిమాలో హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు దర్శకుడు. హీరోకి తగ్గ ప్రతినాయకుడిని ఎన్నుకోవడంలో దర్శకుడిగా తన ప్రతిభను కనబరిచాడు. కొన్ని చోట్ల బాహుబలి పాత్రను భళ్లాలదేవ బాగా డామినేట్ చేశాడు. ప్రభాస్, రానా, అనుష్క ఒకరిపై ఒకరు పోటీ పడుతూ నటించారు. శివగామి పాత్రకు రమ్యకృష్ణ కాకుండా మరోనటిని ఊహించుకోలేము. అంతగా ఆమె పాత్ర ప్రేక్షకులపై ప్రభావితం చూపించింది. నాజర్, సత్యరాజ్ తమ నటనతో సినిమా స్థాయిని పెంచారు. 
 
టెక్నికల్ గా సినిమా స్టాండర్డ్స్ మామూలుగా లేవు. మొదటి భాగంలో పాటలతో పోలిస్తే ఈ సినిమాలో పాటలు ఏవరేజ్ గా ఉన్నాయి. నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సెంథిల్ తన సినిమాటోగ్రఫీతో కథకు ప్రాణం పోశాడు. సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాతో విజువల్ గా అధ్బుతాలనైతే రాజమౌళి సృష్టించగలిగాడు కానీ ఆశించిన రేంజ్ లో అయితే సినిమా లేదనే చెప్పాలి. 
రేటింగ్: 3.5/5