‘సాహో’లో నాపాత్ర అత్యంత భయంకరంగా ఉంటుంది: బాలీవుడ్‌ నటుడు

యంగ్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమాలో తన పాత్ర అత్యంత భయంకరంగా ఉంటుందని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చుంకీ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘సాహో’ సినిమాలో నా పాత్ర గురించి ఎక్కువగా ప్రచారం చేయడం లేదు. టీజర్‌లోనూ ఎక్కువ సేపు కనిపించలేదు. కానీ నేను మీరెప్పుడూ చూడని అత్యంత భయంకరమైన పాత్రలో కనిపిస్తానని మాత్రం చెప్పగలను. నేను ఇప్పటివరకు నటించిన సినిమాల్లో హిందీలో వచ్చిన ‘బేగం జాన్‌’లోని నా పాత్ర చాలా భయకరంగా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ‘సాహో’ లో మాత్రం అంతకంటే భయంకరమైన పాత్రలో నన్ను చూస్తారు’ అని వెల్లడించారు చుంకీ.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో కూడా చుంకీ గట్టిగా కేకలు వేస్తూ కనిపించారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆగస్ట్‌ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.