ప్రమాదానికి కారణం నేను కాదు: హీరో సుధాకర్‌

టాలీవుడ్‌ హీరో సుధాకర్ శనివారం జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. ‘నువ్వు తోపురా’ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాకు వెళ్లిన సుధాకర్ మంగళగిరి వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సమయంలో సుధాకర్ కారు ఢీకొని లక్ష్మి అనే మహిళ మృతి చెందారు.

అయితే ఈ ఘటనలో తానే డ్రైవింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను సుధాకర్ ఖండించారు. ఈ మేరకు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ‘నువ్వు తోపురా’ చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా సుధాకర్‌ ఘటన జరిగిన విధానాన్ని వివరించారు. ‘నేను డ్రైవర్ పక్కసీటులో ఉన్నాను. కారు ట్రక్కుకు తగలడంతో ప్రమాదం జరిగింది. నేను డ్రైవింగ్‌ చేయలేదు. నిజాన్ని ప్రజలకు తెలియజేయండి. మహిళ మృతి నన్ను ఎంతగానో బాధించింది. ఈ ఘటనకు నేను కారణం కాదు. ఆ సమయంలో డ్రైవర్ కారుని నడుపుతున్నారు. డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. మృతురాలు కుటుంబానికి మా చిత్ర బృందం తరఫున, ప్రత్యేకంగా నేను సాయం చేస్తాను’ అని స్పష్టం చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates