ఇంటర్‌ పూర్తి చేయని సచిన్.. హీరో రామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

లెజెండరీ క్రికెటర్‌ సచిన్ బుధవారం తన 47వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్‌ హీరో రామ్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయినందుకు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుని, జీవితానికి స్వస్తి పలుకుతున్న విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. దేశం గర్వించదగ్గ క్రికెటర్‌ సచిన్‌ కూడా ఇంటర్‌ పూర్తి చేయలేదని గుర్తు చేశారు. ”పార్క్‌లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్లలకి ఏదైనా చెబితే వింటారు. బెడ్‌రూమ్‌లో తాళం వేసుకుని జీవితం ఎలా రా?అనుకునే పిల్లలకి.. నిజాలు ఈ విధంగా చెబితేనే వింటారు. ఇంటర్‌ కూడా పూర్తి చేయని ది ప్రైడ్‌ ఆఫ్‌ నేషన్‌ సచిన్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు” అని రామ్‌ ట్వీట్‌ చేశారు.

‘ఇంటర్‌ ఫలితాలే జీవితం అనుకునే నా తమ్ముళ్లకి, చెల్లెళ్లకి.. మీరు జీవితంలో అవ్వబోయేదానికి.. చేయబోయేదానికి.. ఇది ప్రారంభం మాత్రమే. దయచేసి లైట్‌ తీసుకోండి. ఇంటర్‌ కూడా పూర్తి చేయని మీ రామ్‌’ అంటూ విద్యార్థుల్లో ధైర్యం పెంచుతూ రామ్‌ మరో ట్వీట్‌ చేశారు.